కడప లో కమ్మనైన ‘అమ్మ’ భోజనం!

 


కడప నగరానికి చెందిన విద్యాసంస్థల అధినేత సిరిగిరెడ్డి గోవర్ధన్‌రెడ్డికి లోటేమీ లేదు. ఆస్తులు, అంతస్థులతో పాటు అమ్మ ఆశీస్సులూ ఆయనకు ఉన్నాయి. ‘‘ఒక పూట అన్నం పెడితే వారిచ్చే దీవెన కలకాలం ఉంటుంద’’న్న తల్లి ఆదినారాయణమ్మ మాటను మన్నించి.. 20 నెలలుగా కడప నగరంలో ఆయన ఉచిత భోజనం వడ్డిస్తున్నారు. అన్నదానం అంటే నీళ్ల చారు, పలచటి మజ్జిగ పోసి పంపించి వేయడం కాదు. ఉడుకుడుకు అన్నం, నాలుగు రకాల కూరలు వడ్డించి, చల్లగా మజ్జిగ అందిస్తున్నారు. ఆ పక్కనే దప్పిక తీర్చే చలివేంద్రం ఏర్పాటుచేశారు. కడప నగరంలో గోవర్ధన్‌రెడ్డి బసవరామతారకం లా కళాశాల, బీఈడీ, టీటీసీ విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వస్తుంటారు.

‘మీ-కోసం’ ఉండటంతో ఆర్జీలు ఇవ్వడానికి రోజు కన్నా ఎక్కువమంది తరలివస్తుంటారు. వీరిలో వృద్ధ్దులు, వికలాంగులు ఎక్కువ. ఉదయం 10 గంటలకు ‘మీ-కోసం’ ప్రారంభం అయితే వారి పని ముగిసేందుకు మధ్యాహ్నం అవుతుంది. వ్యయ ప్రయాసల కోర్చి వచ్చినవారికి హోటళ్లకు వెళ్లే స్తోమత ఉండదు. రూ.50పెట్టి ప్లేటు భోజనం తింటే, బస్సు చార్జీలకు డబ్బులు చాలవని వెనుకాడుతుంటారు. వారి అవస్థలను తొలగించి, కడుపునిండా అన్నం పెట్టాలని గోవర్ధన్‌రెడ్డి భావించారు. తన ఆలోచనను హితులు, సన్నిహితులతో పంచుకొన్నారు. ‘అమ్మ చెప్పింది. ఆదుకొందాం’ అంటూ ముందుకు అడుగువేశారు. గత సంవత్సరం ఏప్రిల్‌ 4న కలెక్టరేట్‌ ఎదుట ‘‘అన్నం .. పరబ్రహ్మ స్వరూపం’’ అనే బోర్డు వెలిసింది.

అక్కడ ఉచిత భోజనం శిబిరం ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ప్రతి సోమవారం వెయ్యి మందికి తగ్గకుండా అన్నదానం చేస్తున్నారు. ఆ రోజు ఏదో సమయంలో గోవర్ధన్‌రెడ్డి శిబిరానికి వచ్చి, కొద్దిసేపు వడ్డిస్తుంటారు.
 
బంద్‌లు, ప్రభుత్వ సెలవులు మినహాయిస్తే, ఇప్పటికి 73 సోమవారాలు వడ్డన చేశారు. గోవర్ధన్‌రెడ్డి తండ్రి శివారెడ్డి డీఎస్పీగా పని చేశారు. తల్లి ఆదినారాయణమ్మ గృహిణి. ఇప్పుడు వారిద్దరూ లేరు. తాను కడుపు నింపుతున్న అన్నార్తులు అందించే దీవెనల్లో తన తల్లిదండ్రులను చూసుకొంటున్నానని గోవర్ధన్‌రెడ్డి భావోద్వేగంతో అన్నారు. ఒక పూట వడ్డనకు రూ. 15 వేల నుంచి రూ. 18 వేలు ఖర్చు అవుతుంది. డబ్బుల గురించి వెనుకాడబోనని, ఊపిరి ఉన్నంత కాలం పది మంది ఆకలి తీరుస్తానని ఆయన వెల్లడించారు.
 
గోవర్ధన్‌రెడ్డి సంకల్పాన్ని అధికారులు, రాజకీయ, పారిశ్రామిక, విద్యాసంస్థల అధినేతలు అభినందిస్తున్నారు. ఉచిత భోజనం ప్రారంభమైన మూడు వారాల తరువాత అప్పటి కలెక్టర్‌ కేవీ రమణ శిబిరంలో పాల్గొని స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించారు. ప్రస్తుత కలెక్టర్‌ బాబూరావునాయుడు, జాయింట్‌ కలెక్టర్లు శ్వేత తెవతీయ తదితరులు తమకు వీలు చిక్కినప్పుడల్లా శిబిరాన్ని సందర్శిస్తున్నారు.

Post a Comment

0 Comments