కడప జిల్లా యువ రైతు నెల రాబడి

• నాడు రూ. 6 వేలు నేడు రూ.2.90 లక్షలు!
* ఓ యువ రైతు నెల రాబడి..

రాష్ట్రంలో అనంతపురం తర్వాత కడప జిల్లా కరవు ప్రాంతంగా పేరు పొందింది. ఇక్కడ వ్యవసాయంపై ఆధారపడిన రైతుల్లో ఎక్కువ మందికి నష్టాలు తప్పటం లేదు. ఇప్పుడిప్పుడే ఇక్కడి యువ రైతుల దృక్పథంలో మార్పు కన్పిస్తోంది. కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా, అనుబంధ రంగాలవైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఆరుతడి పంటలతో పాటు పశుపోషణపై శ్రద్ధ చూపుతున్నారు. జిల్లాలో దక్షిణ మండలాలైన రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లో ఎక్కువ మంది పాల ఉత్పత్తిని జీవనోపాధిగా చేసుకుని లాభాలు గడిస్తున్నారు. ఇలాంటి ఒక యువ రైతు విజయగాథను తెలుసుకునేందుకు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు నరసింహరాజుగారిపల్లెకు వెళదాం..!
• పశు పోషణకే అంకితం
నాగేంద్రరాజు ఐటీఐ పూర్తి చేశారు. తిరుపతిలో ఓ చిన్న కంపెనీలో రూ.6 వేల వేతనంతో పనిచేయలేక స్వయం ఉపాధిని ఎంచుకోవాలనుకున్నారు. అప్పటికే చిత్తూరు జిల్లాలో లాభసాటిగా ఉన్న పశుపోషణ చేపడితే ఎలా ఉంటుందని ఆలోచించారు. చేతిలో ఉన్న కాస్త డబ్బుతోనే పాడిపోషణ మొదలుపెట్టారు. తొలుత 2005లో రెండు ఆవులతో మొదలైన ప్రయాణం నేటికి 70 ఆవులకు చేరుకుంది. అయిదెకరాల పొలంలో ఇంటి అవసరాలకు కొన్ని పంటలు వేస్తూ.. మిగిలిన భూమిలో పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. పాల సేకరణ, విక్రయాలు, గ్రాసం, షెడ్ల శుభ్రత, ఆరోగ్య పరిరక్షణను ఇంటిల్లిపాది స్వయంగా చూసుకుంటున్నారు. పాల దిగుబడితో ఏటా రూ.35 లక్షల రాబడి పొందుతున్నారు.
• అందుకున్న అవార్డులు
పెట్టుబడి కోసం ఎవరి చుట్టూ తిరగలేదు. బ్యాంకులనూ ఆశ్రయించలేదు. తొలుత కొనుగోలు చేసిన ఆవులకు పుట్టిన దూడలనే పెంచుకుంటూ వచ్చారు. నాలుగేళ్ల తర్వాత, పాడిలో రైతు సాధిస్తున్న ప్రగతిని చూసి.. కడప ఎస్‌బిహెచ్‌ ఆర్థికంగా కొంత చేయూతనిచ్చింది. జిల్లాలో పాల దిగుబడిలో నాగేంద్రరాజు ప్రథముడిగా నిలిచారు. ప్రభుత్వం ఏటా ఇచ్చే ఆదర్శ పాడిరైతు అవార్డులను అందుకున్నారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గాను సేవలందించారు. 2017లో విజయవాడలో జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాగేంద్రరాజుకు ఉత్తమ పాడి రైతు అవార్డును అందించారు.
ఆవులను బిడ్డల కంటే సున్నితంగా పోషిస్తున్నారు. రోజూ రెండు పూటలా నీటితో కడుగుతారు. ఈ ఆవులు అధిక ఎండలను ఏమాత్రం భరించలేవు. సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నారు. పాల ఉత్పత్తి పెరిగేందుకు పోషక విలువలు కలిగిన దాణా, పచ్చి మేతలను వినియోగిస్తున్నారు. దాణాను ఇంటి వద్దే యంత్రం సహాయంతో తయారు చేస్తూ ఇతర రైతులకూ విక్రయిస్తున్నారు.
• నెలకు 10 వేల లీటర్ల పాల ఉత్పత్తి
చిన్న, పెద్ద కలిపి 75 వరకు ఆవులున్నాయి. వీటిలో ఒక్కో ఆవు రోజుకు 15-25 లీటర్ల వరకు పాలిస్తుంది. 35 లీటర్ల వరకు పాలిచ్చే ఆవులు కూడా ఉన్నాయి. రోజుకు 350-400 లీటర్ల పాల ఉత్పత్తి సాధిస్తున్నారు. లీటరు పాలు రూ.28 చొప్పున 350 లీటర్లకు రోజూ సుమారు రూ.9800 రాబడి ఉంటోంది. ఈ లెక్కన నెలకు రూ.2.94 లక్షలు ఆదాయం వస్తోంది. ఇందులో దాణా, మందులు, ఇతర ఖర్చులు రూ.1.30 లక్షలు పోను నెలకు రూ.1.60 లక్షలు మిగులుతున్నాయి. ఒకప్పుడు నెలకు రూ.2 వేలు కూడా కళ్లచూడని ఆ కుటుంబం ఇప్పుడు పాల దిగుబడి ద్వారా లక్షల ఆదాయం పొందుతోంది. పశుపోషణలో ఆదర్శంగా నిలుస్తోంది.
• ఇదంతా కుటుంబ సహకారంతోనే.. 
- నాగేంద్రరాజు
చిన్నపాటి కమతం ఉన్నా, పంటలతో పాటు పాడిని ఎంచుకుంటే కుటుంబ పోషణ భారం కాదు. కుటుంబ సభ్యులంతా కష్టించి పనిచేస్తే.. పశుపోషణలో రాబడి పెరుగుతుంది. యువత స్వయం ఉపాధి వైపు ముందుకు రావాలి. రెండు ఆవులతో మొదలుపెట్టి, నేడు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నా. స్వయం ఉపాధి మార్గాలు అనేకం ఉన్నాయి. ఆ దిశగా నిరుద్యోగులకు చేయూతనిచ్చే కార్యక్రమాలు అమలు కావాలి.

Post a Comment

0 Comments